ఎయిడ్స్​ రోగిలో 216 రోజుల పాటు కరోనా.. వైరస్​ లో 32 జన్యు మార్పులు!

  • ఓ మహిళలో గుర్తించిన దక్షిణాఫ్రికా పరిశోధకులు
  • ఆల్ఫా, బీటా వంటి వేరియంట్లూ ఉన్నాయని వెల్లడి
  • వేరియంట్లకు ఎయిడ్స్ రోగులు ఫ్యాక్టరీలుగా మారే ముప్పుందని ఆందోళన
కరోనా సోకితే వారం లేదా రెండు వారాలు ఉంటోంది. అయితే, కరోనా తదనంతర సమస్యలే ఎక్కువగా వేధిస్తున్నాయి. కానీ, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్న ఓ మహిళకు 216 రోజుల పాటు ఒంట్లో నుంచి కరోనా పోలేదు. అంతేకాదు, ఆమె ఒక్క దానిలోనే కరోనా వైరస్ 32 జన్యు మార్పులకు గురైంది. దక్షిణాఫ్రికాలోని 36 ఏళ్ల మహిళ నమూనాలను పరిశోధించిన డర్బన్ లోని యూనివర్సిటీ ఆఫ్ క్వజూలు నటాల్  శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు.
 
పరిశోధకులు గుర్తించిన కరోనా రకాల్లో ఆల్ఫా వేరియంట్ (బ్రిటన్), బీటా వేరియంట్ (దక్షిణాఫ్రికా), ఈ484కే మ్యుటేషన్లున్నట్టు తేల్చారు. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ ఉన్న క్వజూలు నటాల్ లోనే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఆమెలో అన్ని రోజులు కరోనా ఉండి ఉంటుందని, అన్ని వేరియంట్లు తయారై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఒకవేళ అదే నిజమైతే.. కరోనా వేరియంట్ల తయారీకి హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లే ఫ్యాక్టరీలుగా మారే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ మహిళ నుంచి వేరే వారికి జన్యు మార్పులు చేసుకున్న వేరియంట్లు సంక్రమించాయా అన్నది మాత్రం తెలియదని పేర్కొన్నారు. సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కరోనా ఎక్కువ కాలం పాటు ఉంటుందని, ఎయిడ్స్ పేషెంట్లలో అది మరింత ఎక్కువని అన్నారు. ఎయిడ్స్ పేషెంట్లలోనే ఎక్కువ మ్యుటేషన్లు జరుగుతున్నాయని మరిన్ని అధ్యయనాలు తేలిస్తే 10 లక్షలకుపైగా ఎయిడ్స్ రోగులున్న ఇండియా వంటి దేశాలకు సంకటమేనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.


More Telugu News