ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం: ఆప్‌ ప్రభుత్వ ఆరోపణ

  • మేనిఫెస్టోలోనే చేర్చిన ఆప్‌
  • అమలుకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం
  • తాజాగా అమలు దస్త్రంపై సంతకానికి ఎల్‌జీ నిరాకరణ
  • కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్న ఎల్‌జీ
  • వ్యవహారం కోర్టులో ఉందని ఎల్‌జీ వ్యాఖ్య
దేశ రాజధానిలో వచ్చేవారం నుంచి అమలు చేయ తలపెట్టిన ‘ఇంటింటికీ రేషన్‌ సరకుల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఢిల్లీ సర్కార్‌ ఆరోపిస్తోంది. దీని వల్ల 72 లక్షల మంది పేదలు లబ్ధికి దూరం కానున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తినందుకుగానూ ‘ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’గా ఉన్న పథకం పేరును సైతం మార్చామన్నారు.

అయినప్పటికీ రెండు కారణాలు చెబుతూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) పథకం అమలుకు ఆమోదం తెలపలేదని ఆప్‌ ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం ప్రభుత్వం నుంచి ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు ఆమోదం లభించలేదంటూ ఎల్‌జీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. అలాగే, దీనిపై ప్రస్తుతం కోర్టులో ఓ కేసు నడుస్తోందన్న కారణాలతో పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ఎల్‌జీ చెప్పారని ఆప్ ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతలు నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ పథకాన్ని నిలిపివేసేందుకు రేషన్‌ మాఫియాతో ఎలాంటి ఒప్పందం కుదిరింది? అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ  పథకం అమలుకు సంబంధించి ఆప్‌ ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రజలకు హామీ ఇచ్చింది. గత మార్చిలోనే ఈ పథకాన్ని అమలు చేద్దామని భావించగా.. కేంద్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒకేసారి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌కు మారడం వల్ల తలెత్తే అవకాశం ఉందని, ప్యాకేజింగ్‌, రవాణాకు ప్రజలు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చంటూ కేంద్ర పౌరసరఫరాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.


More Telugu News