ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు

  • అరెస్ట్ చేసి తనను తీవ్రంగా కొట్టారన్న రఘురామ
  • తన ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని వెల్లడి
  • దాన్నుంచి కాల్స్, సందేశాలు చేశారని ఆరోపణ
  • సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల తన అరెస్టును, తదనంతర పరిణామాల పట్ల ఆగ్రహంతో ఉన్న ఆయన తన పట్ల దారుణంగా ప్రవర్తించారంటూ సంబంధిత వర్గాలకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గత నెల 14న తనను అరెస్ట్ చేసినప్పుడు తన నుంచి ఐఫోన్ తీసుకున్నారని, ఇంతవరకు తిరిగివ్వలేదని తన ఫిర్యాదులో ఆరోపించారు.

స్వాధీనం చేసుకున్న ఫోన్ లో 90009 11111 నెంబరుతో వాట్సాప్ ఖాతా ఉందని వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాలో ఫోన్ ను చేర్చలేదంటూ లీగల్ నోటీసు ఇచ్చానని ఢిల్లీ డీసీపీకి తెలియజేశారు. గత నెల 14వ తేదీ రాత్రి సునీల్ కుమార్ సహా నలుగురు తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తర్వాత మరో వ్యక్తి తన ఛాతీపై కూర్చుని ఫోన్ లాక్ తెరవాలని ఒత్తిడి చేశారని రఘురామ వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం ఫోన్ లాక్ ఓపెన్ చేసినట్టు ఫిర్యాదులో వివరించారు.

తన ఫోన్ నుంచే సీఐడీ అదనపు డీజీ వాట్సాప్ సందేశాలు, కాల్స్ చేశారని... గత నెల 14వ తేదీ నుంచి ఈ నెల 1 వరకు తన ఫోన్ ను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ ట్విట్టర్ సందేశం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని రఘురామ పేర్కొన్నారు. 90009 11111 నెంబరు ద్వారా రమేశ్ కు సందేశాలు వెళ్లినట్టు ట్విట్టర్ ద్వారా చెప్పారని వివరించారు. తన ఫోన్ నుంచి సీఐడీ అదనపు డీజీనే కాల్స్, సందేశాలు పంపినట్టు భావిస్తున్నానని తెలిపారు.

ప్రభుత్వ సేవకుడే చట్టాలను ఉల్లంఘించి నేరపూరితంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఆయనపై ఐపీసీ 119, 379, 403, 409, 418, 426, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని రఘురామ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ను కోరారు.


More Telugu News