మోదీ, జిన్​ పింగ్​ లు బాధ్యత కలిగిన నేతలు: రష్యా అధ్యక్షుడు పుతిన్​

  • సమస్యలను వారే పరిష్కరించుకోగలరని కామెంట్
  • వేరే ఏ దేశమూ జోక్యం చేసుకోవద్దని హితవు
  • భారత్ తో బంధం కొనసాగుతుందని వెల్లడి
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ లు బాధ్యత కలిగిన నేతలని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను వారిద్దరే పరిష్కరించుకోగలరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ ప్రక్రియలో వేరే ఏ దేశమూ జోక్యం చేసుకోకూడదని సలహా ఇచ్చారు. క్వాడ్ గ్రూప్ (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన బృందం)కు ముందు నుంచీ వ్యతిరేకంగానే ఉన్న పుతిన్.. ఓ దేశం ఎలా ఆ గ్రూప్ లో ఉంటుందో.. బంధాలను బలపరుచుకునేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుందో తాము ఏనాడు ఆలోచించలేదని అన్నారు.

అయితే, క్వాడ్ గ్రూప్ లో భారత్ ఉన్నంత మాత్రాన.. భారత్ తో తమ సంబంధాలేమీ దెబ్బతినవని ఆయన స్పష్టం చేశారు. రష్యా, చైనా మధ్య బలపడుతున్న బంధమూ భారత్ పై ప్రభావం చూపబోదని తేల్చి చెప్పారు. తమ ఇద్దరి మధ్యా పరస్పర విశ్వాసం ఉందని, దాని వల్లే భారత్, రష్యా మధ్య సంబంధాలు వేగంగా, విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

ఆర్థిక రంగం, ఇంధనం, హైటెక్, రక్షణ తదితర అన్ని అంశాల్లోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, టెక్నాలజీల తయారీలో తమకు ఒకే ఒక్క భాగస్వామి భారత్ అని ఆయన స్పష్టం చేశారు. జూన్ 16న జెనీవాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో తొలిసారి భేటీ అవుతున్న విషయంపైనా పుతిన్ స్పందించారు. ఆ సమావేశంతో ఒరిగేదేమీ లేదని అన్నారు.


More Telugu News