ర‌ఘురామ మొబైల్ నుంచి త‌న కుటుంబ స‌భ్యుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌న్న మాజీ ఐఏఎస్ పీవీ ర‌మేశ్‌.. త‌న మొబైల్ సీఐడీ వ‌ద్ద ఉంద‌న్న ర‌ఘురామ‌

  • ఆ నంబ‌రు ర‌ఘురామ‌కృష్ణ‌రాజుదేన‌న్న రమేశ్ ‌
  • 4 రోజుల క్రితం సిమ్‌ బ్లాక్ చేయించాన‌ని ర‌ఘురామ‌ వివ‌ర‌ణ‌
  • మే 14 నుంచి ఎవ్వ‌రికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంప‌లేదన్న ఎంపీ 
త‌న‌తో పాటు తన కుటుంబ స‌భ్యుల‌కు ఓ మొబైల్ నంబ‌రు నుంచి మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని, ఆ నంబ‌రు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుద‌ని తెలిసింద‌ని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి  పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. దీనిపై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు స్పందించాల‌ని ఆయ‌న కోరారు. దీంతో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు.

'ఏపీ సీఐడీ పోలీసులు మే 14న న‌న్ను అరెస్టు చేసిన రోజున నా మొబైల్ ఫోనును అన‌ధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికీ అది వారి వద్దే ఉంది. దాన్ని తిరిగి ఇచ్చేయాలని నిన్న లీగ‌ల్ నోటీసులు పంపాను. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించాను.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను' అని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వివ‌రించారు.

'మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు నేను ఎవ్వ‌రికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంప‌లేదు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నా మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తాన‌ని హామీ ఇస్తున్నాను' అని ర‌ఘురామ చెప్పారు. దీనిపై స్పందించిన పీవీ ర‌మేశ్ స్ప‌ష్ట‌త ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ మ‌రో ట్వీట్ చేశారు.


More Telugu News