వ్యాక్సిన్ విషయంలో... కేంద్ర ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

  • వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానివి అనాలోచిత నిర్ణయాలు
  • వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదు
  • మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, తప్పుడు, అసందర్భ నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.... ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు.

తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లను కూడా కేంద్రం కొనుక్కోనివ్వడం లేదని అన్నారు. సిద్ధిపేటలో కరోనా సూపర్ స్ప్రెడర్లకు ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సకాలంలో వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయిందని హరీశ్ విమర్శించారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న కేంద్రం... రాష్ట్రాలపై తన తప్పులను తోసేస్తోందని అన్నారు. తప్పుడు నిర్ణయాలపై కేంద్రం పునరాలోచించాలని సూచించారు. వ్యాక్సిన్ దిగుమతులను కేంద్రం సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల కోసం ఆయా కంపెనీలకు ఇప్పటికే తమ ప్రభుత్వం రూ. 100 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చిందని చెప్పారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.


More Telugu News