ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించి.. మ‌ళ్లీ ఇచ్చిన సంస్థ‌!

  • ఆరు నెల‌లుగా ట్వీట్లు చేయ‌లేద‌ని ట్విట్ట‌ర్‌  అభ్యంత‌రం
  • మండిప‌డ్డ నెటిజ‌న్లు
  • అభ్యంత‌రాలు తెలిపిన ఉప రాష్ట్రప‌తి కార్యాల‌యం
  • భార‌త రాజ్యాంగంపై దాడి అన్న బీజేపీ నేత‌లు
  • చివ‌ర‌కు వెన‌క్కి త‌గ్గిన ట్విట్ట‌ర్‌
ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను ఆ సంస్థ తొలగించింది. అయితే, దీనిపై ఉపరాష్ట్రప‌తి కార్యాల‌యం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్ట‌ర్‌ మ‌ళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా ట్విట్ట‌ర్ ప‌లు ర‌కాల ఖాతాల‌కు బ్లూ టిక్‌ను ఇస్తుంది.

ఈ బ్యాడ్జి ఉండే ఆ ఖాతాలను ట్విట్ట‌ర్ ధ్రువీక‌రించింద‌ని, ఆ ఖాతాలు న‌కిలీవి కావ‌ని అర్థం. ప్ర‌భుత్వ సంస్థ‌లు, బ్రాండ్లు, లాభాపేక్ష లేని  స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వార్తా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు, క్రీడాకారులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ నాయ‌కులకు బ్లూ టిక్ ఇస్తుంది.

ఇందు కోసం వారు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, త‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి ఖాతాల నుంచి ట్విట్ట‌ర్ బ్లూ టిక్ ను తొల‌గిస్తోంది. ముంద‌స్తుగా ఎటువంటి నోటీసులు, హెచ్చ‌రికా చేయ‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారు ఎంత‌టి వారైనా స‌రే ఉపేక్షించ‌బోమ‌ని తెలిపేలా ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడి ఖాతా నుంచి బ్లూ టిక్ తొల‌గించింది.

సాధార‌ణంగా ఆరు నెల‌ల పాటు యాక్టివ్ గా లేని ఖాతాలు, ఉద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారం చేయ‌డం, పేరు మార్చుకోవ‌డం వంటి చ‌ర్య‌లకు పాల్ప‌డితే ట్విట్ట‌ర్ బ్లూ టిక్ గుర్తింపును తొల‌గిస్తుంది. వెంక‌య్య నాయుడు ఆరు నెల‌లుగా త‌న వ్య‌క్తిగ‌త ఖాతాలో పోస్ట్ లు చేయ‌డం లేదు.

ఈ కార‌ణంగానే ఆయ‌న బ్లూ టిక్‌ను తొల‌గించింది. అయితే, దీనిపై చాలా మంది నెటిజ‌న్లు మండిప‌డ్డారు. భార‌త ఉపరాష్ట్ర‌ప‌తి కార్యాలయం కూడా ట్విట్ట‌ర్‌కు అభ్యంత‌రాలు తెలిపింది. ఆరు నెల‌లుగా యాక్టివ్ గా లేని కార‌ణంగానే వెంక‌య్య నాయుడి ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను తొల‌గించార‌ని ఉపరాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం నెటిజ‌న్ల‌కు కూడా తెలిపింది.

బీజేపీ ముంబై నేత సురేశ్ నాఖువా ట్విట్ట‌ర్ చ‌ర్య‌ల‌పై మండిప‌డుతూ ఇది భార‌త రాజ్యాంగంపై చేస్తోన్న దాడిగా అభివ‌ర్ణించారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఖాతా నుంచి బ్లూ టిక్‌ను ఎందుకు తొల‌గించార‌ని ప్ర‌శ్నించారు. ట్విట్ట‌ర్‌కు, భార‌త ప్ర‌భుత్వానికి మ‌ధ్య కొన్ని రోజులుగా నిబంధ‌న‌ల విష‌యంలో విభేదాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ కూడా జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ తీసుకున్న చర్య‌పై అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఇన్ని అభ్యంత‌రాల మ‌ధ్య ట్విట్ట‌ర్ వెన‌క్కి త‌గ్గింది. తిరిగి వెంక‌య్యనాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతాకు బ్లూ టిక్ ను ఇచ్చింది. కాగా, ఉపరాష్ట్ర‌ప‌తి అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ఎల్ల‌ప్పుడూ యాక్టివ్ గా ఉంటుండ‌డంతో దానిపై మాత్రం ట్విట్ట‌ర్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.  

    


More Telugu News