చూశారా... నేను చెప్పిందే నిజ‌మైంది!: కరోనా వైరస్ పుట్టుకపై ట్రంప్

  • నేను మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాను
  • ఇప్పుడు కొంద‌రు శత్రువులు స‌హా ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు
  • చైనా 10 ట్రిలియన్‌ డాలర్ల జ‌రిమానా చెల్లించాలి
క‌రోనా వైర‌స్‌ను చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించార‌ని, అక్క‌డి నుంచే అది లీక్ అయింద‌ని అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మొద‌టి నుంచీ ఆరోపిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపైనే ఆయ‌న మ‌రోసారి స్పందిస్తూ... ఆ వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని అన్నారు.

క‌రోనాను వూహాన్‌ ల్యాబ్‌లో శాస్త్ర‌వేత్త‌లే సృష్టించారని ఇటీవల పలు అధ్యయనాలు చెప్పిన విష‌యాల‌ను గుర్తు చేశారు. క‌రోనాను సృష్టించి ప్ర‌పంచాన్ని ఇంత‌టి సంక్షోభంలోకి నెట్టేసిన చైనా భారీగా జ‌రిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను అప్ప‌ట్లో చెప్పింది ఇప్పుడు కొంద‌రు శత్రువులు స‌హా ప్రతి ఒక్కరూ అంటున్నారని ఆయ‌న చెప్పారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా మరణాలు, విధ్వంసానికి కారణమైన చైనా త‌మ దేశంతో పాటు ప్రపంచానికి మొత్తం 10 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆయ‌న అన్నారు. కాగా, గ‌తంలోనూ ట్రంప్ చైనాపై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌గా వాటికి ఆధారాలు లేవని ప‌లువురు శాస్త్రవేత్తలు, అమెరికా గూఢఛారి సంస్థలు పేర్కొన్నాయి.

అయితే, కొన్ని రోజులుగా చైనా గురించి ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. క‌రోనాను చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగానే సృష్టించింద‌ని, చైనా పరిశోధనల ఫలితంగా అది వ్యాప్తి చెందింద‌ని బ్రిటన్ ప‌రిశోధ‌కులు కూడా పేర్కొన్నారు.


More Telugu News