అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

  • ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన ఢిల్లీ వైద్యుల సంఘం
  • అల్లోపతి వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • మూడు వారాల్లోగా స్పందించాలని రాందేవ్‌కు ఆదేశం
  • మున్ముందు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న కోర్టు
అల్లోపతి వైద్యం, కరోనా టీకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు నిన్న సమన్లు జారీ చేసింది. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ వైద్యుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడితో ఆగక పతంజలి అభివృద్ధి చేసిన కొరోనిల్ కిట్‌‌తో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొంది.

విచారించిన న్యాయస్థానం రాందేవ్ బాబాకు నిన్న సమన్లు జారీ చేసింది. సమన్లకు మూడు వారాల్లోగా స్పందనను దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, మున్ముందు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని రాందేవ్ బాబాకు చెప్పాలని ఆయన తరపు న్యాయవాదికి సూచించింది.

కాగా, రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వైద్యుల సంఘం.. ఆయన నుంచి నామమాత్రపు పరిహారంగా రూపాయి ఇప్పించాలని కోరింది. మరోవైపు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ జోన్ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జె.గీతారెడ్డి కేంద్రమంత్రులు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్‌లకు లేఖ రాస్తూ.. అల్లోపతి వైద్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని చెడగొట్టేలా రాందేవ్ బాబా, పతంజలి చైర్మన్ బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News