తనపై దాడిని పార్లమెంటుపై దాడిగా పరిగణించాలంటూ ఎంపీలకు రఘురామకృష్ణరాజు లేఖలు

  • తనకు అందిన లేఖను ట్విట్టర్‌లో పెట్టిన ఎంపీ మాణికం ఠాగూర్
  • చూసి షాకయ్యానన్న మాణికం
  • ఎంపీకే ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్న
  • ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమన్న కాంగ్రెస్ నేత
రాజద్రోహం కేసులో అరెస్ట్ అయి ఇటీవల విడుదలైన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వివిధ పార్టీల ఎంపీలు, పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తోపాటు సభ్యులకు లేఖలు రాశారు. తన అరెస్ట్, తదనంతర పరిణామాల గురించి ఆ లేఖల్లో వివరించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపినందుకే తనపై కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు.

 జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఉన్నాయని, వాటిలో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయనతోపాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

వ్యక్తిగత కక్షతోనే తనపై రాజద్రోహం కేసు నమోదు చేశారని రఘురామరాజు ఆరోపించారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న తనపై ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొన్నారు. కాళ్లపై లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టారన్నారు. ఈ సందర్భంగా కాళ్లు గాయాలయ్యాయంటూ వాటి ఫొటోలను లేఖలకు జత చేశారు. ఒక ఎంపీపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు.

ఇక తనకు అందిన లేఖను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్ ట్విట్టర్‌లో పెట్టడంతో లేఖల విషయం వెలుగుచూసింది. ఈ లేఖను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మాణికం ఠాగూర్ అన్నారు. ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రఘురామ కష్ణరాజు ఏపీ బార్‌కౌన్సిల్‌కు మరోపక్క ఫిర్యాదు చేశారు.


More Telugu News