ఒలింపిక్స్ కు వెళ్లే బృందాన్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

  • జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్
  • జపాన్ లోని టోక్యో వేదికగా విశ్వక్రీడాసంరంభం
  • త్వరలో భారత బృందం జపాన్ పయనం
  • ఏర్పాట్లను సమీక్షించిన ప్రధాని
  • అందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని ఆదేశం
టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో జులైలో సమావేశం అవుతానని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఒలింపిక్స్ కి వెళ్లే అథ్లెట్ల బృందాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. యావత్ దేశ ప్రజల ఆశలన్నీ వారిపైనే ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో క్రీడలకు సంబంధించి ఉత్తేజభరితమైన సంస్కృతిని రూపొందించారంటూ క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క భారత క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటితే, దేశంలో మరో 1000 మంది యువత క్రీడల వైపు అడుగులేస్తారని వివరించారు.

ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులతో పాటు కోచ్ లు, ఇతర సహాయక సిబ్బంది, జట్టు అధికారులకు కూడా వ్యాక్సిన్ అందించాలని సూచించారు. ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.


More Telugu News