జైలులో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన డేరాబాబా

  • అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరాబాబా
  • కొన్నివారాల కిందట అస్వస్థత
  • పీజీఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స
  • తాజాగా కడుపునొప్పితో బాధపడుతున్న వైనం
అత్యాచార అభియోగాలు నిరూపితం కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా (గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం రోహతక్ లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. రక్తపోటు సమస్యలు, నీరసం వంటి అంశాలతో డేరా బాబా కొన్నివారాల కిందట చండీగఢ్ లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

అయితే, డేరా బాబాకు తాజాగా కడుపు నొప్పి రావడంతో ఇదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పొట్టభాగానికి సీటీ స్కాన్ చేయించారు. ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి సునారియా జైలుకు తరలించారు. 17 ఏళ్ల కిందట ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాపై అభియోగాలు నిరూపితమయ్యాయి. నాలుగేళ్ల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా డేరా సచ్చా సౌదా పేరిట మతం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆశ్రమాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. డేరా బాబా ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, సినిమాలు, సంగీతంలోనూ తన మార్కు చూపించారు. గతంలో తానే హీరోగా సినిమా నిర్మాణం, తన సంగీత ప్రతిభను చాటేలా సొంత ఆల్బంలు రూపొందించారు.


More Telugu News