కేర‌ళను తాకిన నైరుతి రుతుప‌వ‌నాలు

  • రెండు రోజుల ఆల‌స్యంగా ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు
  • కేర‌ళ తీరం ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌ప‌డ్డాయ‌న్న ఐఎండీ
  • ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం  
నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళను తాకాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.ఈ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌డంతోనే దేశంలో వానాకాలం ప్రారంభ‌మవుతుందని భావిస్తారు. సాధార‌ణంగా నైరుతి రుతుప‌వ‌నాలు జూన్ 1న కేర‌ళ‌ను తాకుతాయి. ఈ సారి రెండు రోజుల ఆల‌స్యంగా ప్ర‌వేశించాయి.

కేర‌ళ తీరం ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌ప‌డ్డాయ‌ని, కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ ప్ర‌క‌టించింది. అలాగే, ద‌క్షిణ క‌ర్ణాట‌క‌లో కొన్ని ప్రాంతాల్లోకి రుతుప‌వ‌నాలు త్వ‌ర‌లోనే ప్ర‌వేశిస్తాయ‌ని తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఈశాన్య రాష్ట్రాల్లో జూన్ 8 నుంచి 10 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదవుతుంద‌ని ఇప్ప‌టికే ఐఎండీ అంచనా వేసింది. కాగా, దేశంలో ప్రధానంగా నైరుతి రుతుపవనాల స‌మ‌యంలో కురిసే వర్షాల‌పైనే ఆధారపడి పంటలు పండిస్తారు. 2019తో పాటు 2020లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా న‌మోదైంది.


More Telugu News