భార‌త్‌లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న సీరం

  • ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌
  • భార‌త్‌లో ఇప్ప‌టికే అనుమ‌తులు
  • ఉత్ప‌త్తి ప్రారంభించిన రెడ్డీస్ ల్యాబ్‌
  • సీరం కూడా అందుకు ముందుకు వ‌చ్చిన వైనం
  • ఇప్ప‌టికే రెండు వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోన్న సీరం
ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్ర‌భావశీల‌త గురించి విశ్లేష‌ణ, ప‌రీక్ష‌లు చేయ‌డానికి కూడా అనుమ‌తులు ఇవ్వాలని సీరం సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

భార‌త్‌లో స్పుత్నిక్-వీ వినియోగానికి ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ర‌ష్యా నుంచి ఇప్ప‌టికే దాదాపు 30 ల‌క్ష‌ల డోసులు భార‌త్‌కు చేరుకున్నాయి. వీటిని హైద‌రాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వ‌ర్యంలో పంపిణీ చేస్తున్నారు. అలాగే, దేశంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్ కూడా ఉత్ప‌త్తి చేయ‌నుంది.

ఇప్పుడు సీరం కూడా ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే భార‌త్‌లో సీరం ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ నెల‌లో 10 కోట్ల డోసులు ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిపింది. అంతేగాక‌, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించింది. దీనికి అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉంది.


More Telugu News