నమూనా అద్దె చట్టానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.. యజమానికి మరిన్ని అధికారాలు!

  • ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం
  • కొత్త చట్టానికి గ్రీన్ సిగ్నల్
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపనున్న కేంద్రం
  • అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటిత మార్కెట్‌గా రూపొందించేలా నూతన చట్టానికి రూపకల్పన
దేశంలో అద్దె ఇళ్ల రంగం అంతకంతకు విస్తృతమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి పెట్టింది. అద్దె ఇళ్ల రంగాన్ని సుస్థిరంగా, సమ్మిళితంగా మార్చడం, అన్ని ఆదాయ వర్గాల వారికీ అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచడంతోపాటు ఇళ్ల కొరతను తీర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు.

నమూనా అద్దె చట్టానికి గ్రీన్ సిగ్నల్ పడడంతో దీనిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపనుంది. ఈ విషయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చట్టాలకు అనుగుణంగా కొత్త అద్దె చట్టాలను అవి తయారుచేసుకోవాల్సి ఉంటుంది. అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటిత మార్కెట్‌గా రూపొందించేందుకు ఈ నమూనా చట్టం దోహదం చేస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 1.1 కోట్ల ఖాళీ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ చట్టం వల్ల అద్దెల ద్వారా ఆదాయం పెరగడం, దోపిడీ తగ్గడం, రిజిస్ట్రేషన్ నిబంధనల భారం తొలగిపోతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ చట్టం ప్రకారం.. లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇళ్లు, వ్యాపార సముదాయాలను అద్దెకివ్వడం కుదరదు. అద్దెకుండేవారు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ గరిష్ఠంగా రెండు నెలల అద్దె, నివాసేతర సముదాయం అయితే గరిష్ఠంగా ఆరు నెలల అద్దె అడ్వాన్సుగా తీసుకోవాలి. ఇది వివిధ నగరాల్లో వివిధ రకాలుగా ఉంది.

అయితే, అద్దె ఎంత ఉండాలనేదానిపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. ఇది అద్దెదారు, యజమాని మధ్య పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కానీ, కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న తర్వాత కానీ అద్దెదారు ఖాళీ చేయకుంటే తొలి రెండు నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత నాలుగు రెట్ల అద్దె వసూలు చేయడడానికి యజమానికి అధికారం ఉంటుంది. వివాదాల పరిష్కారం కోసం రెంట్ ట్రైబ్యునళ్లు, రెంట్ కోర్టులు ఏర్పాటు చేయొచ్చు.

ఈ చట్టం పరిధిలోకి నివాస, వాణిజ్య, విద్యా సంబంధ అద్దె విషయాలు వస్తాయి. పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చే అద్దెలు దీనికి వర్తించవు. అలాగే, హోటళ్లు, లాడ్జీలకూ మినహాయింపు ఉంటుంది. ముందస్తు ఒప్పందం ప్రకారం యజమాని అద్దె పెంచొచ్చు. లేదంటే మూడు నెలల ముందస్తు నోటీసు తర్వాత కూడా పెంచొచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటికీ ఇది వర్తిస్తుంది.

యజమాని ఇంట్లో వస్తువులు పాడైతే వాటిని అద్దె దారుడే భరించాల్సి ఉంటుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అద్దెదారులు చేసుకునే లిఖిత పూర్వక ఒప్పంద పత్రాన్ని రెంట్ అథారిటీకి సమర్పించాలి. వివాదం ఏదైనా కోర్టులో ఉన్నప్పటికీ అద్దె మాత్రం చెల్లిస్తూనే ఉండాలి. రెంట్ కోర్టు, ట్రైబ్యునళ్లు 60 రోజులలోపు ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది.


More Telugu News