శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • పథకం అమలు నిదానించిందన్న సీఎం
  • ఇక పథకాన్ని పరుగులు తీయించాలని ఆదేశం
  • 2023 నాటికి సర్వే పూర్తి కావాలని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ఈ పథకం అమలు నిదానించిందని, ఇకపై వేగంగా సాగాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు. ఈ పథకంలో భాగంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలని, పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించారు. సర్వే పూర్తయితే అన్నిటికీ క్లియర్ టైటిళ్లు వస్తాయని, దాంతో భూ వివాదాలు సమసిపోతాయని స్పష్టం చేశారు.

కొన్ని మారుమూల ప్రాంతాలు, అటవీప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు వచ్చినా, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, సర్వేకు ఆటంకం కలగకుండా కావాల్సిన వస్తు సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎంకు అధికారులు సర్వే అంశాలను నివేదించారు. రాష్ట్రంలో సర్వే నిమిత్తం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరికొన్ని స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని, అందుకోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకుంటామని చెప్పారు. సర్వేలో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయిందని సీఎం జగన్ కు వెల్లడించారు. ఇక గ్రామాల్లో సమగ్ర సర్వే చేసి, ఆపై 2022 మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్ చేపడతామని వివరించారు.

అటు, నగరాలు, పట్టణాల్లోనూ సర్వే మొదలైందని, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. మూడు దశల్లో 2023 ఏప్రిల్ నాటికి పట్టణాలు, నగరాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు.


More Telugu News