సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేయొచ్చు: విజయసాయిరెడ్డి

  • పాలనా రాజధాని కచ్చితంగా విశాఖకు వస్తుంది
  • సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు సంబంధం లేదు
  • మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది
పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఎప్పుడు అవుతుందనే విషయంలో డేట్ మాత్రం అడగొద్దని విజయసాయి చెప్పారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన అన్నారు.

విశాఖలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్ వేస్తామని, ముడుసర్లోవ పార్కుని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రంగువెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలని, ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని చూరగొనాలని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి, విద్వేషాలను రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News