వామ్మో.. ముగ్గురు పిల్లలా?: వద్దే వద్దంటున్న చైనా యువత

  • ప్రభుత్వ ప్రకటనపై పెదవి విరుపులు
  • ఖర్చులు తడిసిమోపెడవుతాయని భయం
  • నగరాల్లో చోటూ చాలట్లేదని ఆవేదన
  • ఒంటరిగా ఉండేందుకే చాలా మంది మొగ్గు
  • బాగా దెబ్బ కొట్టిన ‘వన్ చైల్డ్’ విధానం
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశమేదంటే.. ఠక్కున వచ్చే సమాధానం చైనా. అయితే, అంత జనాభా ఉన్నా.. ముగ్గురు పిల్లల్ని కనొచ్చంటూ ఆ దేశం రెండు రోజుల క్రితమే ప్రకటన చేసింది. కారణం.. ఆ దేశంలో యువత తక్కువగా ఉండడం, వృద్ధులు పెరిగిపోతుండడమే. దాని వల్ల భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయంతో ముగ్గురు పిల్లల ప్రకటన చేసింది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం.

అక్కడి యువత మాత్రం ‘వామ్మో.. ముగ్గురు పిల్లలా?’ అనేస్తోంది. ఇద్దరు పిల్లలతోనే బతకలేకపోతున్నాం.. ముగ్గుర్ని కనాలా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇంకొకరిని కంటే మరింత భారమవుతుందని భయపడుతున్నారు. ఇటు పని వేళలు, ఒత్తిడితో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.

 ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పిల్లల్నే కనేందుకు చాలా మంది మహిళలు ఇష్టపడడం లేదని 22 ఏళ్ల పీజీ విద్యార్థిని యాన్ జియాఖీ చెప్పింది. ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవాలనుకోవడం లేదని, ఉన్న డబ్బుతో ‘ఏక్ నిరంజన్’ జీవితాలకే మొగ్గు చూపుతున్నారని తెలిపింది.

ఇప్పుడున్న వారికే నగరాలు సరిపోవడం లేదని, ఇంకా పిల్లల్ని కని ఎక్కడ పెట్టుకోవాలని యాంగ్ షెంగ్యీ అనే ఇద్దరు పిల్లల తండ్రి వాపోయాడు. ‘‘మా ఆదాయం అంతంత మాత్రమే. ఇద్దర్ని సాకడానికే ఆ మొత్తం చాలట్లేదు. మా నలుగురికి ఉంటున్న ఇల్లూ సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలంటే కష్టమే’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. పనివేళలు ఎక్కువగా ఉండడం, ఇళ్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా ధరలు భారీగా ఉండడం వంటి కారణాల వల్ల కొందరైతే పెళ్లిళ్లూ వద్దనుకుంటున్నారు.

దెబ్బ కొట్టిన ‘ఒక్కరే ముద్దు’

జనాభా భారీగా పెరిగిపోతుండడంతో చాలా ఏళ్ల క్రితం చైనా ప్రభుత్వం వన్ చైల్డ్ (ఒక్కరే) పాలసీని తీసుకొచ్చింది. ఆ నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్షలూ వేసింది. దీంతో చైనా ప్రజలు దానికి బాగా అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఒక్కరే చాలు అన్నదానికి కట్టుబడిపోయారు. దీని వల్ల వృద్ధులు పెరిగిపోతుండడంతో 2016లో ఆ నియమాన్ని చైనా మార్చింది. ఇద్దర్ని కనేందుకు అనుమతినిచ్చింది. అయినా కూడా జనాల్లో మార్పు రాలేదు. ఇప్పుడు ముగ్గుర్ని కనండి అని ప్రభుత్వం చెప్తున్నా.. చాలా మంది ‘ఒక్కరికే’ ఫిక్స్ అయిపోతున్నారు.

యువతలో ఆ సిద్ధాంతాన్ని తొలగించేందుకు చైనా ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ప్రకటించినా అది ఏ మూలకు వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా చైనా సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయంపై మీమ్స్ పేలుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా చాలా ఆలస్యమైపోయిందని మ్యాడిసన్ లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ కు చెందిన శాస్త్రవేత్త యీ ఫూషియాన్ చెప్పారు.

ప్రస్తుతం చైనా సంతాన సగటు రేటు 1.3 (ఒక్కొక్కరు కనే పిల్లల సగటు)గా ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం జనాభాను స్థిరంగా ఉంచడానికి కావాల్సిన రేటు కన్నా అది తక్కువని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News