కొవిడ్ సోకినవారికే ఆనందయ్య మందు... ఎమ్మెల్యే కాకాని వివరణ

  • ఆనందయ్య మందు విధివిధానాలకు రూపకల్పన
  • వికేంద్రీకరణ పద్ధతిలో మందు పంపిణీ
  • పోస్టు కొరియర్ ద్వారానూ అందుకోవచ్చన్న కాకాని
  • ఎవరూ కృష్ణపట్నం రావొద్దని విజ్ఞప్తి
ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, మందు పంపిణీ విధివిధానాలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ మందును వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ పద్ధతిలో పంపిణీ చేస్తామని, అది కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మందును పోస్టు, కొరియర్ సేవల ద్వారా కూడా అందిస్తామని అన్నారు.

అయితే, కరోనా సోకిన వారికే తొలి ప్రాధాన్యత అని, మందును మొదట వారికే అందిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో, కరోనా రాకుండా మందు ఇవ్వనున్నట్టు వివరించారు. ఆన్ లైన్ విధానంలో మందు పంపిణీ చేస్తున్నందున, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఆనందయ్య మందు పంపిణీపై చర్చించేందుకు నిన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు.


More Telugu News