అమరావతి రైతులకు వార్షిక కౌలు వెంటనే విడుదల చేయండి: నారా లోకేశ్

  • గతేడాది కూడా ఆలస్యం చేశారన్న లోకేశ్
  • రైతులు ఇబ్బందులు పడ్డారని వెల్లడి
  • ఇప్పుడు కూడా ఆలస్యం అయిందని ఆరోపణ
  • ఇంతవరకు కౌలు చెల్లించకపోవడం సరికాదని వ్యాఖ్యలు
అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలును వెంటనే చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఆర్డీయే/ఏఎంఆర్డీయే కమిషనర్ కు లేఖ రాశారు. కౌలు విడుదల చేయడంతో పాటు రైతుల ఆరోగ్య సంరక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణకు రైతులు తమ భూమిని త్యాగం చేశారని లోకేశ్ వెల్లడించారు. ప్రతి ఏడాది మే నెలలో వీరికి కౌలు చెల్లించాలని, కానీ గతేడాది కరోనా మొదటి దశ సందర్భంగా కౌలు చెల్లింపు నెల రోజులు ఆలస్యం కావడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కరోనా రెండో దశ సమయంలోనూ ఇంతవరకు కౌలు చెల్లించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

భూమిని త్యాగం చేసిన రైతుల్లో ఎక్కువమంది హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులేనని లోకేశ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, కరోనా సోకిన రైతుల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

2014 డిసెంబరు నాటికి అమరావతి ప్రాంతంలో నివసించే వారందరికీ ఉచిత వైద్యసేవలు అందించేందుకు నాటి రాష్ట్ర సర్కారు బాధ్యత తీసుకుందని వివరించారు. అందుకు అనుగుణంగా ఆరోగ్య కార్డులను జారీ చేసిందని, కానీ ఇప్పుడు ఆ కార్డులు చూపిస్తే అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స నిరాకరిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు.


More Telugu News