జులై నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి: ఐసీఎంఆర్ చీఫ్

  • భారత్ లో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్
  • క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
  • డిసెంబరు నాటికి 108 కోట్ల మందికి వ్యాక్సిన్
  • కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఇదేనన్న బలరాం భార్గవ
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్నప్పటికీ, జూలై మధ్య నాటికి గానీ, ఆగస్టు మొదటి వారం నాటికి గానీ ప్రతిరోజు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ అన్నారు. ఈ ఏడాది చివరికి 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వ్యాక్సిన్ లభ్యత రెట్టింపు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీదార్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ, భారతదేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని సహనం పాటించాల్సిన అవసరం ఉందని బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే దేశంలో కొత్త వ్యాక్సిన్ తయారీదార్లు వస్తున్నారని, ఇకమీదట దేశంలో కరోనా వ్యాక్సిన్ కు కొరత వస్తుందని తాను భావించడంలేదని స్పష్టం చేశారు.

ఇక, దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతుండడం పట్ల ఆయన స్పందిస్తూ... కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం, కఠిన కంటైన్మెంట్ నిబంధనలు సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో సాయపడ్డాయని వివరించారు. అయితే, దీర్ఘకాలంలో ఇవేమంత స్థిరమైన నిర్ణయాలు అనిపించుకోవని, కేవలం వీటిపైనా ఆధారపడడం అవివేకం అవుతుందని బలరాం భార్గవ పేర్కొన్నారు. డిసెంబరు నాటికి దేశంలో అత్యధికులు వ్యాక్సిన్ పొందుతారని తెలిపారు.


More Telugu News