ఈడబ్ల్యూఎస్ కోటాలోకి మరాఠాలు.. 10% రిజర్వేషన్లు కల్పిస్తూ మహా ప్రభుత్వం జీవో

  • ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
  • 2020 సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి
  • ఎస్ఈబీసీ అపాయింట్ మెంట్లకు లైన్ క్లియర్
  • ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయొద్దని సుప్రీం ఆదేశాలు
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు మే 5న రద్దు చేసిన నేపథ్యంలో, మహా ప్రభుత్వం తాజాగా మరాఠాలను ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి తీసుకువస్తూ కొత్తగా జీవో ఇచ్చింది. ఇందుకు సంబంధించి మంగళవారం మహారాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) జీవోను జారీ చేసింది.

మరాఠాలను 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కిందకు తీసుకొస్తున్నట్టు జీవోలో పేర్కొంది. మరాఠా రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించిన 2020 సెప్టెంబర్ 9 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. మధ్యంతర స్టే విధించడంతో పెండింగ్ లో పడిపోయిన ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) అభ్యర్థుల అపాయింట్ మెంట్లకూ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుందని తెలిపింది.

కాగా, ఏ రిజర్వేషన్ లేని మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. వార్షికాదాయం 8 లక్షల కన్నా తక్కువున్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుతాయని చెప్పారు.


More Telugu News