యోగా.. ఆయుర్వేద కషాయం.. కఠిన నిబంధనలు.. ఆ ఆశ్రమాన్ని ఇప్పటిదాకా టచ్​ చేయని కరోనా!

  • కోయంబత్తూర్ ఈశా యోగా కేంద్రంలో క్రమశిక్షణ
  • 3 వేలకు పైగా వలంటీర్ల కఠోర శ్రమ
  • వేకువనే గ్లాసు గోరువెచ్చని నీళ్లతో వేపాకులు, పసుపు ముద్దలు
  • ఆ తర్వాత 15 మూలికల కషాయం
  • చుట్టు పక్కల 43 గ్రామాల్లోనూ అమలు
దేశం మొత్తం సెకండ్ వేవ్ తో అల్లాడి పోతున్నా.. ఒక చోటు మాత్రం ఆ మహమ్మారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. రోజూ యోగా, ఆయుర్వేదం, కఠిన నియమాలు, ఆంక్షలు, కట్టు తప్పితే శిక్షలు.. ఇలా కరోనాను కట్టడి చేసింది. ఆ చోటు తమిళనాడు కోయంబత్తూర్ లోని ఈశా యోగా కేంద్రం. 3 వేల మందికిపైగా వలంటీర్లు కఠిన నియమాలను పాటించడం వల్లే ఇది సాధ్యమైందని ఆ సెంటర్ కో ఆర్డినేటర్ మా జయిత్రి చెప్పారు. చుట్టుపక్కల 43 గ్రామాలూ ఇదే రీతిలో ముందుకు సాగుతున్నాయన్నారు.

‘‘ఏడాది కాలంగా కరోనా ఆంక్షలు, నియమాలను కఠినంగా పాటిస్తున్నాం. అతిథుల రాకను ఆపేశాం. బయట నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశాం. ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే శిక్ష వేస్తున్నాం. చేతిలో పలక పట్టుకుని రెండు గంటలు నిలబెడుతున్నాం’’ అని ఆమె వివరించారు. అంతేగాకుండా ఎప్పటికప్పుడు అందరికీ జ్వరం చెక్ చేస్తున్నామని, భౌతిక దూరం పాటిస్తున్నామని, ఆశ్రమాన్ని శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు.

యోగాసనాలతో ఆరోగ్యంగా..

ఆశ్రమంలోని వారు కరోనా బారిన పడకపోవడానికి మరో కారణం యోగాసనాలే అంటున్నారు. రోజూ మూడు నిమిషాల పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచే ‘సింహ క్రియ’ అనే యోగాసనాన్ని తప్పనిసరి చేశారు. ఆశ్రమంలో పచ్చి కూరగాయాలు, పండ్లు వంటి సాత్వికాహారమే ఎక్కువగా తీసుకుంటున్నామని ఆశ్రమ మెడికల్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుమన్ చెప్పారు. రోజూ ఉదయాన్నే 4.30 గంటలకే నిద్ర లేస్తామని, పరగడుపున వేప ఆకులు, పసుపు ముద్దలు మింగి గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగుతామని మా జయిత్రి చెప్పారు. రోజూ రెండు సార్లు ఖాళీ కడుపుతో నీలవేంబు కషాయం అనే ఆయుర్వేద ద్రావణాన్నీ తీసుకుంటామని ఆమె తెలిపారు.


43 గ్రామాలకూ లబ్ధి

అయితే తమ నియమ, నిబంధనలను కేవలం ఆశ్రమానికే పరిమితం చేయలేదు. ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న 43 గ్రామాల్లోనూ విస్తృతం చేశారు. అందుకే కోయంబత్తూర్ నగరంలో భారీ కేసులు నమోదవుతున్నా.. ఆయా పల్లెల్లో మాత్రం చాలా చాలా తక్కువ కేసులు వచ్చాయని చెబుతున్నారు. చుట్టు పక్కల 13 హామ్లెట్ల పరిధిలో ఒక్క కేసు కూడా లేదంటే నమ్ముతారా? అని ఓ గ్రామ పంచాయతీ పెద్ద చెప్పుకొచ్చారు. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లరని, అవసరం ఉంటేనే ఇలా వెళ్లి అలా వచ్చేస్తారని చెప్పారు.

ఆశ్రమ నిర్వాహకులు 43 గ్రామాల్లో లక్ష మందికి 15 వనమూలికలతో తయారుచేసిన ఆయుర్వేద కషాయాన్ని రోజూ అందిస్తున్నారట. అంతేగాకుండా యోగాసనాలనూ నేర్పిస్తున్నారు. కరోనా నిబంధనలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు.


More Telugu News