భార‌త్‌లో వెలుగు చూసిన కొవిడ్‌ వేరియంట్‌ 'బి.1.617'కు పేరు పెట్టిన డ‌బ్ల్యూహెచ్ఓ

  • డెల్టాగా నామకరణం చేసిన డ‌బ్ల్యూహెచ్ఓ
  • అంతకుముందు వచ్చిన వేరియంట్ పేరు కప్పా
  • బ్రిటన్‌ కొవిడ్‌ వేరియంట్‌కు ఆల్ఫా పేరు
  • దక్షిణాఫ్రికా వేరియంట్‌కు బీటా
  • బ్రెజిల్‌ వేరియంట్‌కు గామా  
కొవిడ్‌ వేరియంట్‌ బి.1.617ను ఇండియన్‌ వేరియంట్‌ అని పిల‌వ‌కూడ‌ద‌ని భార‌త ప్ర‌భుత్వం పేర్కొన్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, కొత్తగా వెలుగుచూసే ఏ కరోనా వేరియంట్‌నూ దేశాల పేర్లతో పిలవకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఇటీవ‌లే స్ప‌ష్టం చేసింది. దీంతో కొత్త వేరియంట్‌ల‌కు డ‌బ్ల్యూహెచ్ఓ పేర్లు పెడుతోంది. భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్‌ బి.1.617కు డబ్ల్యూహెచ్‌ఓ 'డెల్టా'గా నామకరణం చేసింది.

భారత్‌లో అంతకుముందు వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్ కు  'కప్పా' అని పేరు పెట్టింది. కొత్త పేర్లు పెట్టిన‌ప్ప‌టికీ ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామకరణాలను నూతన పేర్లు భర్తీ చేయవని స్ప‌ష్టం చేసింది. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారమనీ, పరిశోధనలో ఉపయోగపడతాయని తెలిపింది. కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని కోరింది.

క‌రోనా వేరియంట్లను గ్రీక్‌ ఆల్ఫాబెట్‌లు అయిన ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని డబ్ల్యూహెచ్‌ఓలోని నిపుణుల బృందం ఇటీవ‌లే సూచించింది. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ వాటికి పేర్లు పెడుతోంది. ఈ పేర్లు సాధారణ ప్రజలు సైతం పలకడానికి  సులువుగా ఉంటాయని తెలిపింది. బ్రిటన్‌ కొవిడ్‌ వేరియంట్‌కు ఆల్ఫా అని, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు బీటా అని, బ్రెజిల్‌ వేరియంట్‌కు గామా అని నామకరణం చేసింది.


More Telugu News