తిరుపతి శివారు కాలనీల్లో చిరుత సంచారం.. హడలిపోతున్న జనం

  • కాలనీలోని ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించిన చిరుత
  • బాణసంచా కాల్చి భయపెట్టే ప్రయత్నం చేసిన స్థానికులు
  • కర్రలతో తరుముతూ అడవిలోకి తరిమేసిన వైనం 
తిరుపతి శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. నగర పరిధిలోని 45వ డివిజన్‌ శివజ్యోతినగర్ సమీపంలోకి ఆదివారం రాత్రి వచ్చిన చిరుతను చూసిన జనం భయంతో హడలిపోయారు. అడవిలోంచి కాలనీలోకి ప్రవేశించిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించింది.

ఈ క్రమంలో చిరుతను భయపెట్టేందుకు కొందరు బాణసంచా కాల్చారు. మరికొందరు కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించాయి.

కాగా, ఇటీవలి కాలంలో తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నడకదారిలో పలుమార్లు కనిపించిన చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అవి అడవి నుంచి జనారణ్యంలోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.


More Telugu News