ఓటమిని జీర్ణించుకోలేకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు: కేంద్రంపై మమత ధ్వజం

  • యాస్ సైక్లోన్ సమీక్ష సందర్భంగా వివాదం
  • మమత కోసం మోదీ వేచిచూడాల్సి వచ్చిందన్న కేంద్రం
  • ప్రతి రోజూ ఏదో ఒక వివాదం రేకెత్తిస్తున్నారన్న మమత
  • బీజేపీని సమావేశానికి పిలవడం ఏంటని మండిపాటు 
నిన్న యాస్ తుపాను సమీక్ష సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలో కేంద్రం తనపై నిందలు మోపడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీని 30 నిమిషాల పాటు వేచి చూసేలా చేశారని కేంద్రం మమతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన మమత... ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేంద్రం ఈ విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.

తమను ఓడించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిన కేంద్రం పెద్దలు, దారుణంగా భంగపడ్డారని, అప్పట్నించి ప్రతి రోజు ఏదో ఒక వివాదం రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. 'ఈ విధంగా నన్ను అవమానించాలని ప్రయత్నించకండి' అని మమత బీజేపీ నేతలకు హితవు పలికారు.

 ప్రధాని మోదీ యాస్ తుపాను ఏరియల్ సర్వేకు వచ్చిన రోజున తనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని, ఆ కార్యక్రమాల షెడ్యూల్ ఒకరోజు ముందే నిర్ణయమైందని మమత స్పష్టం చేశారు. తాను పర్యటన మధ్యలో ఉండగా, ప్రధాని మోదీ ఏరియల్ సర్వేపై సమాచారం అందిందని వివరించారు. నిన్నటి ప్రధాని సమావేశం రాజకీయ సమీకరణాలు సరిచేసేందుకే అన్నట్టుగా సాగిందని, విపక్ష బీజేపీని సమావేశానికి పిలవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

కాగా, తుపాను రివ్యూ సమావేశంలో బీజేపీ నేత సువేందు అధికారి కనిపించడం మమతను ఆగ్రహానికి గురిచేసింది.


More Telugu News