రఘురామ గాయాలు కస్టడీలోనే అయ్యాయని సైనిక ఆసుపత్రి చెప్పలేదు: ఏపీ సీఐడీ

  • రఘురామకు ఎడిమా ఉందని మాత్రమే చెప్పింది
  • వైద్యులు ఇచ్చిన ఏ ఒక్క నివేదికలో గాయాల ప్రస్తావన లేదు
  • అలా ప్రచారం చేయడం తగదు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కాళ్లకు అయిన గాయాలపై ఏపీ సీఐడీ స్పష్టత ఇచ్చింది. రఘురామకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సైనిక ఆసుపత్రి ఎక్కడా చెప్పలేదని సీఐడీ పేర్కొంది. కాబట్టి ఇందుకు విరుద్ధంగా చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసింది. సైనిక ఆసుపత్రి నివేదికకు ముందే మూడుసార్లు వైద్యులు పరిశీలించి నివేదిక ఇచ్చారని, వాటిలో రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడా చెప్పలేదని పేర్కొంది.

అలాగే, రఘురామను గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరచడానికి ముందు జారీ చేసిన ఫిట్‌నెస్ ధ్రువపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది. సైనిక ఆసుపత్రి కూడా ఇదే విషయాన్నిచెప్పిందని, ఆయనకు ఎడిమా ఉందని తప్పితే కస్టడీలోనే గాయాలు అయినట్టు ఎక్కడా పేర్కొనలేదని వివరించింది. కాబట్టి గాయాలు ఉన్నట్టు సైనికాసుపత్రి ధ్రువీకరించిందని చెప్పడం సరికాదని సీఐడీ పేర్కొంది.


More Telugu News