వ్యాక్సిన్లు మారినా ప్రతికూల ప్రభావం ఉండదు: కేంద్రం

  • యూపీలో 20 మందికి వేర్వేరు డోసులు
  • వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్ర విమర్శలు
  • చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
  • వేర్వేరు డోసుల వల్ల ప్రమాదం ఉండబోదన్న నీతి ఆయోగ్ సభ్యుడు
తొలి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల 20 మందికి ఇలా వేర్వేరు డోసులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

తాజాగా, ఈ విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. రెండు వేర్వేరు డోసులు తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవన్నారు. నిజానికి మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయన్నారు.

అయితే, రెండో డోసు ఏదైనప్పటికీ ప్రతికూల ప్రభావం మాత్రం ఉండబోదని తాను చెప్పగలనన్నారు. రెండో డోసు వేసుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మరింత బలోపేతమవుతుందన్నారు. తొలి డోసు ఏది ఇచ్చారో మలి డోసు కూడా అదే ఇచ్చేలా చూడాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనపై విచారణ జరపాల్సిందేనని పాల్ పేర్కొన్నారు.


More Telugu News