తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

  • డిమాండ్ల సాధన కోసం జూడాల సమ్మె బాట
  • ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు మినహాయింపు
  • మే 28 నుంచి అన్ని విధులకు దూరమవుతామని హెచ్చరిక
  • పలు డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన సర్కారు
జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పట్ల తెలంగాణ సర్కారు సానుకూలంగా స్పందించడంతో సమ్మె ముగిసింది. స్టయిఫండ్ పెంపును అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూడాలు సమ్మెకు దిగడం తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అత్యవసర, ఐసీయూ సేవలు మినహా మిగతా సేవలకు తాము దూరంగా ఉంటామని జూడాలు ప్రకటించారు. మే 28 నాటికి ప్రభుత్వం సామరస్య పూర్వకంగా ముందుకు రాకపోతే అత్యవసర సేవలకు కూడా తాము దూరంగా ఉంటామని హెచ్చరించారు.  

అయితే, సమ్మెకు ఇది సమయం కాదని మంత్రి కేటీఆర్ స్పందించారు. జూడాల సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ కూడా అదే రీతిలో పిలుపునిచ్చారు. వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో జూడాల ప్రతినిధుల చర్చలు ఫలప్రదం అయ్యాయి. జూడాల వేతనం 15 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన స్టయిఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేయనున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం కూడా 80,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నామని జూడాలు వెల్లడించారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేర్చకున్నా, సీఎం సానుకూల స్పందనతో సమ్మె విరమిస్తున్నామని తెలిపారు.


More Telugu News