చీడపురుగుల్లా మారి దోచుకుంటున్నారు... కార్పొరేట్ ఆసుపత్రులపై మంత్రి కొడాలి నాని ఫైర్

  • గుడివాడలో కొడాలి నాని సమీక్ష
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులపై ఆగ్రహం
  • సంస్కారహీనులంటూ ధ్వజం
  • మానవత్వంతో వ్యవహరించాలని హితవు
ఏపీలో కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో చీడపురుగుల్లా దోచుకుంటున్నారని, శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారని విమర్శించారు.

 ఇలాంటి ఆసుపత్రులను ఉపేక్షించినా, క్షమించినా భవిష్యత్ తరాలకు ద్రోహం తలపెట్టిన వాళ్లమవుతామని వ్యాఖ్యానించారు. కరోనా రోగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం అని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

సెకండ్ వేవ్ లో దయనీయ పరిస్థితులు ఏర్పడగా, కొందరు సంస్కారహీనుల్లా తయారై దోపిడీ చేస్తున్నారని, అలాంటి వారిని అధికారులు గుర్తుంచుకోవాలని తెలిపారు.  రోగులను దోచుకునే ఆసుపత్రుల కథ ముగించేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.


More Telugu News