ఆనంద‌య్య‌ను నిర్బంధించ‌డం స‌రికాదు.. వెంట‌నే ఆయ‌న‌ను వ‌దిలిపెట్టి స్వేచ్ఛ ఇవ్వాలి: సోమిరెడ్డి

  • ఆనంద‌య్య ఔష‌ధం పెద్ద‌ల‌కేనా? పేద‌ల‌కు వ‌ద్దా?
  • అనధికారికంగా వేల మందికి త‌యారు చేయించుకుంటారా?
  • ఆనంద‌య్య మందుతో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు
  • మ‌రి ఎందుకు అనుమ‌తులు ఇవ్వ‌ట్లేదు?  
ఆనంద‌య్య ఔష‌ధం పెద్ద‌ల‌కే ఇస్తారా? పేద‌ల‌కు వ‌ద్దా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. నెల్లూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అనధికారికంగా వేల మందికి ఆనంద‌య్య‌తో మందు త‌యారు చేయించుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఆనంద‌య్య‌ను నిర్బంధించ‌డం స‌రికాదు వెంట‌నే ఆయ‌న‌ను వ‌దిలిపెట్టి స్వేచ్ఛ ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఆనంద‌య్య మందుతో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారని, మ‌రి సాధార‌ణ ప్ర‌జ‌లు వినియోగించుకునేందుకు ఎందుకు అనుమ‌తులు ఇవ్వ‌ట్లేదు? అని సోమిరెడ్డి నిల‌దీశారు. దుష్ప్ర‌భావాలు లేవని ఆయుష్ క‌మిష‌న‌ర్ కూడా ప్ర‌క‌టించారని ఆయన చెప్పారు. ఆ ఔష‌ధంపై ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌కరమ‌ని సోమిరెడ్డి అన్నారు.

ఇప్ప‌టికే 70 వేల మంది ఆనంద‌య్య మందును తీసుకున్నారని, ఎవ్వ‌రూ నెగెటివ్ గా దాని గురించి మాట్లాడ‌లేదని సోమిరెడ్డి చెప్పారు. ఆ మందుపై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని స్వ‌యంగా ఎంపీ మాగుంట అన్నారని ఆయ‌న తెలిపారు.


More Telugu News