అందరూ కలిసి పోరాడాల్సిన స‌మ‌యం వ‌చ్చింది: ఈట‌ల‌తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • ఈట‌ల రాజేంద‌ర్ త‌ప్పు చేస్తే స‌స్పెండ్ చేయాలి
  • భూములు ఆక్ర‌మిస్తే పార్టీలో ఎందుకు ఉంచారు
  • కొత్త పార్టీ గురించి మాకు తొంద‌ర లేదు
  • కేసీఆర్ వ్య‌తిరేక నేత‌ల ఐక్యత ఇప్ప‌టికైనా జ‌ర‌గాలి
మేడ్చ‌ల్ జిల్లాలోని శామీర్‌పేట‌లో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాంతో పాటు ప‌లువురు నేత‌లు చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ... 'ఈట‌ల రాజేంద‌ర్ త‌ప్పు చేస్తే టీఆర్ఎస్ నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయాలి. భూములు ఆక్ర‌మిస్తే పార్టీలో ఎందుకు ఉంచారు? ఆ స‌స్పెండ్ చేయ‌కుండా క‌క్ష సాధింపు ధోర‌ణికి ఎందుకు పాల్ప‌డుతున్నారు?' అని ప్ర‌శ్నించారు.

'కొత్త పార్టీ గురించి మాకు తొంద‌ర లేదు. ప్ర‌స్తుతం క‌రోనా నుంచి తెలంగాణ గ‌ట్టెక్క‌డ‌మే మాకు కావాలి. కొవిడ్ క‌ట్ట‌డి, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియపైనే ఈ స‌మ‌యంలో తొంద‌ర‌ప‌డాలి ఇత‌ర అంశాల‌పై కాదు. క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తే సీఎం కేసీఆర్‌కు మేమంతా మ‌ద్ద‌తు ఇస్తాం. రాజకీయ ప‌రంగా క‌క్ష‌లు తీర్చుకునేందుకు ఇది స‌మ‌యం కాదు. కేసీఆర్ వ్య‌తిరేక నేత‌ల ఐక్యత ఇప్ప‌టికైనా జ‌ర‌గాలి' అని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చెప్పారు.

ప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో అంద‌రూ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని కోదండ‌రాం అన్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌పై జ‌రిగిన దాడి తెలంగాణ ఆత్మ‌గౌర‌వం మీద జ‌రిగిన దాడిగా ప‌రిగ‌ణిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌బెట్టి క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌డం స‌రికాద‌ని తెలిపారు.

తాను చెప్పిన‌ట్లుగానే అంద‌రూ వినాల‌ని కేసీఆర్ అనుకుంటారని, ఒక‌వేళ ఇందుకు వ్య‌తిరేకంగా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే వారిపై కేసీఆర్ విప‌రీత‌మైన విద్వేషాన్ని ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెప్పారు. వ్యాపారాలు చేసుకునే వారి మీద కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. నేత‌ల‌ను ఆర్థికంగా, రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌నే ప్ర‌య‌త్నం చేస్తార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయ నేత‌ల‌ పిల్ల‌ల‌పై కూడా కేసులు పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.

వ్యాక్సిన్లు దొర‌క‌క ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటే దాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మెకు దిగితే దాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌జా  స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. క‌క్ష సాధింపు చర్య‌ల‌ను మాత్రం కొన‌సాగిస్తున్నార‌ని మండిపడ్డారు. రాజ‌కీయమంటే కొత్త పార్టీ పెట్ట‌డం ఒక్క‌టే కాద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వంపై అంద‌రూ క‌లిసి పోరాడాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌ని తెలిపారు.  


More Telugu News