దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన పోలీసులు!

  • దొంగను కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్‌లోనే బంధించిన పోలీసులు
  • దోపిడీ చేసి తన వాటా తీసుకున్న వరుణ్ నుంచి డబ్బులు రాబట్టేందుకు కిడ్నాప్
  • బాధితుడిని విడిపించి అరెస్ట్ చేసిన పోలీసులు
  • హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
పొరపాటు కాదు.. మీరు చదివింది నిజమే. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల అవతారం ఎత్తారు. ఓ దొంగను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా మరో ఇద్దరిని అధికారులు సస్పెండ్ చేశారు.

తన సోదరుడిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ ఈ నెల 25న సన్‌లైట్ కాలనీ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తానిప్పుడు లక్ష రూపాయలు పట్టుకుని సరిగ్గా సరాయ్ కాలే బస్టాండ్‌లో ఉన్నానని, కానీ వారు మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను భారతిగా గుర్తించారు. తన సోదరుడు వరుణ్‌ను కిడ్నాప్ చేశారని, డబ్బుల కోసం పదేపదే వాట్సాప్ కాల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జామియా నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్, అమీర్ ఖాన్‌ల కస్టడీలో బాధితుడు ఉన్నట్టు గుర్తించి విడిపించారు. వెంటనే వెళ్లి కానిస్టేబుల్, అతడి సహచరులను అరెస్ట్ చేశారు.

కొన్ని నెలల క్రితం తన సహచరులు గాంధీనగర్‌లో ఓ వ్యక్తిని దోచుకున్నారని, అందులో వరుణ్ కూడా ఉన్నాడని తన ఇన్ఫార్మర్ ఆమిర్ ఖాన్ తనతో చెప్పాడని విచారణలో హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు. ఈ సందర్భంగా వరుణ్ తన వాటా రూ. 1.5 లక్షలు తీసుకున్నాడని, అతడిని కిడ్నాప్ చేయడం ద్వారా ఆ సొమ్మును రికవర్ చేసుకోవచ్చని కానిస్టేబుల్‌తో ఆమిర్ చెప్పడంతో కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు.

ఈ దోపిడీపై గాంధీనగర్‌లో కేసు నమోదైన విషయం కానిస్టేబుల్‌కు కూడా తెలుసని అధికారులు తెలిపారు. జామియా నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వరుణ్‌ను రక్షించిన పోలీసులు.. అప్పటికే అతడిపై దోపిడీ కేసు నమోదై ఉండడంతో అరెస్ట్ చేశారు. అతడి ఇంటి నుంచి రూ. 1.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


More Telugu News