ఆన్ లైన్ క్లాసులో లైంగిక దుష్ప్రవర్తన.. చెన్నై టీచర్ అరెస్ట్!

  • అసభ్యంగా ప్రవర్తిస్తున్న శేషాద్రి బాల విద్యా భవన్ ఉపాధ్యాయుడు
  • ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన కనిమొళి
  • ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన విద్యా సంస్థ యాజమాన్యం
ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించిన 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ లో ఈ ఘటన జరిగింది. అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పోస్కో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను కాపాడే చట్టం) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేశారు.

ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా సదరు ఉపాధ్యాయుడు పర్సనల్ గా అసభ్య కంటెంట్ ను పంపించడం, మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన గురించి స్కూలు యాజమాన్యానికి ముందే తెలిసినప్పటికీ... ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి నిన్న స్పందిస్తూ... సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని ఆమె అన్నారు. విద్యార్థుల ఫిర్యాదుపై తగు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కనిమొళి స్పందించిన వెంటనే స్కూలు యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అయితే, ఉపాధ్యాయుడి దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని యాజమాన్యం చెప్పింది. ఇలాంటి అంశాలపై తాము చాలా సీరియస్ గా ఉంటామని తెలిపింది. విద్యార్థుల మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది.


More Telugu News