వ్యాక్సిన్ సిబ్బందిపై క‌ర్ర‌ల‌తో గ్రామ‌స్థుల దాడి.. పారిపోయిన సిబ్బంది.. వీడియో ఇదిగో

  • ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో ఘ‌ట‌న
  • వ్యాక్సిన్ అంటే ఆ గ్రామ‌స్థుల‌కు భ‌యం
  • అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వ‌చ్చిన సిబ్బంది
  • గ్రామ‌స్థుల దాడిలో పంచాయతీ అధికారిణికి తీవ్రగాయాలు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్‌పై ఉన్న భ‌యం ఇంకా పోలేదు. అది వేయించుకుంటే అనారోగ్యానికి గుర‌వుతామ‌ని భావిస్తున్నారు. అసత్య ప్ర‌చారాన్ని న‌మ్మ‌డ‌మే కాకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు కూడా దిగుతున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకోవ‌డంతో వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భ‌యంతో కారులో పారిపోవాల్సి వ‌చ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతోన్న గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు. వారి రాక‌ను ముందుగానే గుర్తించిన  గ్రామస్థులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు.

వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌గానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్ట‌డానికి దూసుకొచ్చారు. కొంద‌రు అధికారులు త‌ప్పించుకుని కారులో పారిపోగా, పంచాయతీ అధికారిణికి మాత్రం తీవ్రగాయాల‌య్యాయి. అనంత‌రం ఆ గ్రామంలోకి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితులు చేజారకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.


More Telugu News