బీజేపీలో చేరాలంటూ ఈట‌ల రాజేంద‌ర్‌కు అధికారిక ఆహ్వానం?

  • ఓ ఫామ్‌హౌస్‌లో కిషన్‌రెడ్డి, గడ్డం వివేక్‌తో ఈటల స‌మావేశం
  • కలిసి పోరాటం చేద్దామన్న బీజేపీ నేత‌లు
  • అనుచరులతో మాట్లాడి చెపుతాన‌న్న‌ ఈటల?
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం, ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ విచార‌ణకు ఆదేశించడం వంటి ప‌రిణామాలు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాక ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటన్న దానిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈట‌ల కొత్త రాజ‌కీయ పార్టీ పెడ‌తార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అలాగే బీజేపీలో చేర‌తార‌న్న ఊహాగానాలూ వ‌చ్చాయి. వీటికి బ‌లాన్ని చేకూర్చేలా తాజాగా ఓ విష‌యం మీడియా దృష్టికి వ‌చ్చింది. ఈట‌ల‌ను త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలిసింది.

కేంద్ర స‌హాయ మంత్రి, బీజేపీ నేత‌ కిషన్‌రెడ్డితో పాటు కీల‌క నేత‌ గడ్డం వివేక్‌ ఈటలతో స‌మావేశం జ‌రిపి ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై కలిసి పోరాటం చేద్దామని వారు ఈటలను కోర‌గా, దీనిపై త‌న‌ అనుచరులతో చర్చించి, త‌న నిర్ణ‌యాన్ని తెలుపుతాన‌ని ఈటల రాజేందర్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇంత‌కు ముందు కూడా ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో ఈటల రాజేంద‌ర్ మాట్లాడిన విష‌యం తెలిసిందే. తాజాగా జరిగిన భేటీకి మాత్రం అధిక ప్రాధాన్యం ఉంది. హైద‌రాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో అధికారికంగా జ‌రిగిన ఈ స‌మావేశం అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తోంది.


More Telugu News