ఆనందయ్య అప్రకటిత నిర్బంధం గర్హనీయం: టీడీపీ పొలిట్ బ్యూరో

  • వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడితోనే ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేత
  • వైసీపీ గూండాల దాడిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతల అక్రమ అరెస్టులు
  • 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో మహానాడు
కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న ఆనందయ్యను అప్రకటిత నిర్బంధంలో పెట్టడం గర్హనీయమని టీడీపీ పొలిట్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న సమావేశమైన పొలిట్ బ్యూరో పలు విషయాలపై చర్చించింది.

కృష్ణపట్నంలో ఆనందయ్య నుంచి దాదాపు 70 వేల మంది కరోనాకు మందు తీసుకున్నారని, ఏ ఒక్కరి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని పొలిట్ బ్యూరో పేర్కొంది. ఆయుష్ శాఖ కూడా ఆనందయ్య మందువల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిందని, అయినా ప్రభుత్వం మాత్రం ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకుని నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడితోనే జగన్ ప్రభుత్వం మందు పంపిణీని నిలిపివేసిందని పొలిట్ బ్యూరో ఆరోపించింది.

ఇక బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలపై పెట్టిన కేసుల గురించి కూడా పొలిట్ బ్యూరో చర్చించింది. జనార్దన్‌రెడ్డి ఇంటి సమీపంలో వైసీపీ గూండాలు చేసిన దాడిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించింది. టీడీపీ నేతల ఫిర్యాదులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది.

జగన్ తన రాజకీయ కక్ష సాధింపునకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, ప్రభుత్వాసుపత్రుల సందర్శనకు బయలుదేరిన 40 మంది టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంపైనా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలోనే మహానాడును నిర్వహించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది.


More Telugu News