కరోనా మందులను గౌతమ్ గంభీర్, తదితరులు పెద్ద మొత్తంలో ఎలా కొన్నారో దర్యాప్తు చేయండి: ఢిల్లీ హైకోర్టు ఆదేశం

  • కరోనా మందులు పంపిణీ చేసిన గంభీర్
  • ఆక్సిజన్ సేకరించిన ఆప్ ఎమ్మెల్యేలు
  • స్పందించిన హైకోర్టు
  • దర్యాప్తు చేయాలంటూ డ్రగ్ కంట్రోలర్ కు ఆదేశం
ఇటీవల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున కరోనా ఔషధాలను పంపిణీ చేయడం పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయనేతలు పెద్దమొత్తంలో కరోనా ఔషధాలను కొనుగోలు చేస్తున్న వ్యవహారంపై విచారణ జరపాలని ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ ను హైకోర్టు ఆదేశించింది.

 ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో గంభీర్ వంటివారికి ఔషధాలు ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర ఔషధాలను గంభీర్ పంపిణీ చేస్తుండడం వెనుక సదుద్దేశాలే ఉండొచ్చు కానీ, అది బాధ్యతాయుతమైన వైఖరి అనిపించుకోదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

అంతేకాదు, ఆక్సిజన్ సేకరణ, నిల్వ చేస్తున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్ లపైనా ఇలాంటి విచారణకే ఆదేశించింది. ఈ మేరకు స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ కు స్పష్టం చేసింది. ఇప్పటికే నేతలు కరోనా ఔషధాలు పొందుతున్న తీరుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సంబంధిత సమాచారాన్ని డ్రగ్ కంట్రోలర్ కు అందించాలని పేర్కొంది.


More Telugu News