కరోనా గురించి ప్రపంచానికి తెలియకముందే వుహాన్ ల్యాబ్ సిబ్బందికి అనారోగ్యం: వాల్ స్ట్రీట్ జర్నల్

  • చైనాలో వెలుగుచూసిన కరోనా
  • వుహాన్ ల్యాబ్ పై ఇప్పటికీ అనుమానాలు
  • కొవిడ్ మూలాలపై మరో అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఓ సన్నాహాలు
  • ఆసక్తికర కథనం ప్రచురించిన అమెరికా పత్రిక
యావత్ మానవళిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ తొలుత చైనాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే, చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ కరోనా వైరస్ కు పుట్టినిల్లు అని ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అమెరికాలోని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఆసక్తికర కథనం వెలువరించింది.

కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకముందే వుహాన్ ల్యాబ్ లో ముగ్గురు సిబ్బంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని ఈ కథనం సారాంశం. 2019 నవంబరులో ఈ ఘటన జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ వివరించింది. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత చైనా కరోనా వైరస్ గురించి అధికారికంగా ప్రకటించిందని తెలిపింది. ఇదే అంశంపై గోప్యంగా ఉంచిన అమెరికా నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనం ప్రచురించింది.

తమకు అందిన సమాచారం ప్రకారం... వుహాన్ ల్యాబ్ లో ఎంతమంది సిబ్బంది, ఎప్పుడు అస్వస్థతకు గురయ్యారు? వారు ఎన్ని పర్యాయాలు ఆసుపత్రికి వెళ్లారు? అనే అంశాలు వెల్లడయ్యాయని వివరించింది. కొవిడ్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది? అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి అధ్యయనం జరపాలని భావిస్తున్న తరుణంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు వుహాన్ లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఏ బృందం అక్కడి వైరాలజీ ల్యాబ్ కు క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే.


More Telugu News