దీక్ష‌కు దిగిన‌ బండి సంజ‌య్.. 'చెప్పింది చేయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్' అంటూ ఆగ్ర‌హం

  • తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష పేరుతో నిర‌స‌న‌
  • రైతుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త సీఎం కేసీఆర్‌కు లేదా?
  • యాసంగి పంట‌ల‌ను వెంట‌నే కొనుగోలు చేయాలి
  • అన్ని వ‌ర్గాల వారినీ కేసీఆర్ ఇబ్బంది పెడ‌తారు  
'తెలంగాణ రైతు గోస - బీజేపీ పోరు దీక్ష' పేరుతో ఆ పార్టీ నేత‌లు ఈ రోజు దీక్ష‌కు దిగారు. అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాల‌యాల్లో ఆ పార్టీ నేత‌లు ఈ దీక్ష‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని  బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష చేపట్టి మీడియాతో మాట్లాడారు.

రైతుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త సీఎం కేసీఆర్‌కు లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. యాసంగి పంట‌ల‌ను వెంట‌నే కొనుగోలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌రుగు పేరిట రైతులను మోసం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'ఉచితంగా యూరియా, విత్త‌నాల‌ను రైతులకు ఎందుకు ఇవ్వ‌ట్లేదు? చెప్పింది చేయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఏమీ చేయ‌ని ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే ఏమీ ప‌ట్ట‌న‌ట్లు ఉంటున్నారు. ఓ సారి ఆర్టీసీ కార్మికుల‌ను ఇబ్బందులు పెడ‌తారు. మ‌రోసారి ఉద్యోగుల‌ను ఇబ్బంది పెడ‌తారు. ఇంకోసారి నిరుద్యోగుల‌ను ఇబ్బందులు పెడ‌తారు.

'ఇలా అన్ని వ‌ర్గాల వారినీ ఇబ్బందులు పెడుతూ రాష్ట్ర సీఎం ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. రైతులు పంట వేసేట‌ప్పుడు భ‌య‌ప‌డుతున్నారు.. ఒక వేళ పంట చేతికి అందితే అకాల వ‌ర్షాలు ఎక్క‌డ ప‌డ‌తాయో అని భ‌య‌ప‌డుతున్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో ఎక్క‌డ‌ మోసాల‌కు గురి చేస్తున్నారు' అని బండి సంజ‌య్ విమ‌ర్శించారు.

'కేసీఆర్ త‌న ఫామ్‌హౌస్‌లో ఒక్క ఎక‌రానికి కోటి రూపాయ‌లు సంపాదిస్తున్నారు. రైతులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. రైతులు ఎందుకు అంతగా సంపాదించ‌లేక‌పోతున్నారు?' అని బండి సంజ‌య్ నిల‌దీశారు.


More Telugu News