సురేశ్ జాదవ్ వ్యాఖ్యలకు మేం దూరంగా ఉంటున్నాం: సీరం

  • వ్యాక్సినేషన్ పై సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యాఖ్యలు
  • స్టాక్ చూసుకోకుండా వ్యాక్సినేషన్ ఏంటన్న జాదవ్
  • వివరణ ఇచ్చిన సీరం సంస్థ
  • పూనావాలా ఒక్కరే తమ అధికార ప్రతినిధి అని స్పష్టీకరణ
దేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరచుగా వార్తల్లో ఉంటోంది. ఇటీవల ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వ్యాక్సిన్ నిల్వలను పరిగణనలోకి తీసుకోకుండా దేశంలో వివిధ వయసుల వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. వ్యాక్సిన్ డోసులు తగినన్ని ఉన్నాయా? లేదా? అని చూసుకోకుండా, ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలు పట్టించుకోకుండానే వ్యాక్సినేషన్ షురూ చేశారని ఆయన విమర్శించారు.

అయితే, సురేశ్ జాదవ్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు రావడంతో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. సురేశ్ జాదవ్ వ్యాఖ్యలతో సీరం కు సంబంధం లేదని సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్రానికి వివరణ ఇచ్చారు. అతని వ్యాఖ్యలకు సీరం దూరంగా ఉంటోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీరం సీఈవో అదర్ పూనావాలా తరఫున కేంద్రానికి ప్రకాశ్ కుమార్ సింగ్ లేఖ రాశారు. పూనావాలా ఒక్కరే సీరం అధికార ప్రతినిధి అని, ఆయన వ్యాఖ్యలనే పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.


More Telugu News