కరోనా మరణాలు, ఆక్సిజన్ గురించే కాదు... రికవరీ రేట్ గురించి కూడా మాట్లాడుకుందాం: రేణూ దేశాయ్

  • కరోనా వ్యాప్తిపై రేణూ సందేశం
  • వీడియో షేర్ చేసిన ఆరోగ్యాంధ్ర
  • ప్రతికూల చర్చలు సరికాదన్న రేణూ దేశాయ్
  • సానుకూల అంశాలు కూడా ఉన్నాయని వెల్లడి
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ కరోనా వ్యాప్తిపై ప్రత్యేక సందేశం అందించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కరోనా గురించి మాట్లాడుతున్నారని, అయితే ఎంతసేపూ కరోనా మరణాలు, ఆక్సిజన్ కొరత వంటి ఇతర ప్రతికూల అంశాలనే మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇది సరైన దృక్పథం కాదని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సానుకూల అంశాలను చర్చించాలని, మనకు ప్రస్తుతం రికవరీ రేట్ ఎంతో మెరుగుపడిందని, అలాంటి ఉత్సాహం కలిగించే అంశాలను ప్రస్తావించాలని రేణూ దేశాయ్ సూచించారు.

తనకు తెలిసిన వాళ్లలో 70 ఏళ్ల వయసున్నవారు కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారని వివరించారు. డబుల్ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలని, అప్పటికీ కరోనా పాజిటివ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. మనకు ఎంతో మెరుగైన వైద్య వ్యవస్థ ఉందని, డాక్టర్లపై నమ్మకం ఉంచి చికిత్స పొందాలని రేణూ తెలిపారు.

గట్టిగా పోరాడితే కరోనాను జయిస్తారని పిలుపునిచ్చారు. ఈ మేరకు రేణూ దేశాయ్ సందేశంతో కూడిన వీడియోను ఏపీ ప్రభుత్వానికి చెందిన 'ఆరోగ్యాంధ్ర' తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకుంది.


More Telugu News