చైనా మారథాన్​ పై వడగండ్ల బీభత్సం.. 21 మంది దుర్మరణం

  • మారథాన్ లో పాల్గొన్న 172 మంది
  • 18 మందిని కాపాడిన అధికారులు
  • కొనసాగుతున్న సహాయ చర్యలు
  • అకస్మాత్తుగా విరుచుకుపడిన అతిచల్లని వర్షం
చైనాలో మారథాన్ పై అతిచల్లని వర్షాలు, వడగండ్లు ప్రాణ గండంలా పడ్డాయి. 21 మందిని బలి తీసుకున్నాయి. గన్షూ ప్రావిన్స్ లోని బయాన్ కు సమీపంలో ఉన్న ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ లో జరుగుతున్న వంద కిలోమీటర్ల క్రాస్ కంట్రీ మౌంటెయిన్ రేస్ సాగుతుండగా భారీ వర్షాలు విరుచుకుపడ్డాయని చైనా జాతీయ మీడియా వెల్లడించింది. మొదట 20 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయ్యారని చెప్పింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టగా.. ఉదయం 9.30 గంటలకు మృతదేహం లభించిందని పేర్కొంది.

శనివారం మధ్యాహ్నం మారథాన్ సాగుతుండగా 20 నుంచి 31 కిలోమీటర్ల మధ్య వడగండ్ల వాన అకస్మాత్తుగా విరుచుకుపడిందని అధికారులు చెబుతున్నారు. దానికి తోడు బలమైన గాలులు వీచాయన్నారు. మారథాన్ లో 172 మంది పాల్గొనగా.. 18 మందిని కాపాడగలిగినట్టు ప్రకటించారు. ప్రస్తుతం మిగతా వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.


అతి శీతల వాతావరణం కారణంగా చాలా మంది రన్నర్ల శరీర ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని చెబుతున్నారు. కాగా, గన్షూ ప్రావిన్స్ ప్రకృతి పరంగా అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. గతంలో అక్కడ భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడిన దాఖలాలను స్థానికులు వివరిస్తున్నారు. 2010లో వచ్చిన బురద వరద వల్ల ఒకే పట్టణంలో వెయ్యి మంది చనిపోయారని చెబుతున్నారు. అంతేగాకుండా ఆ ప్రాంతం భూకంప ప్రమాద జాబితాలోనూ ఉందంటున్నారు.


More Telugu News