ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన రెజ్లర్ సుశీల్ కుమార్

  • పంజాబ్ లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • జూనియర్ రెజ్లర్ హత్య కేసులో సుశీల్ పై ఆరోపణలు
  • హత్య తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • రూ.1 లక్ష రివార్డు ప్రకటన
హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణాపై దాడి చేసి అతడి మృతికి కారకుడయ్యాడని సుశీల్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపితే రూ.1 లక్ష రివార్డు కూడా ప్రకటించారు.

అతడి కోసం 8 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్ లో పట్టుబడ్డాడు. సుశీల్ కుమార్ కారులో వెళుతుండగా, యూపీలోని మీరట్ టోల్ ప్లాజా వద్ద అతడి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విరివిగా దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో, ఫొటోల ఆధారంగా  విశ్లేషణ జరిపిన పోలీసులు సుశీల్ పంజాబ్ దిశగా వెళ్లాడని గుర్తించారు.

పక్కా సమాచారంతో దాడులు చేసి సుశీల్ కుమార్ తో పాటు అజయ్ కుమార్ అనే మరో అనుమానితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఈ నెల మొదటివారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా మరణించాడు. సాగర్ పై దాడి చేసినవారిలో సుశీల్ కుమార్ కూడా ఉన్నట్టు ఈ కేసులో అరెస్టయిన వారి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.


More Telugu News