భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితులపై ఐఎంఎఫ్ ఆందోళ‌న‌

  • మధ్య ఆదాయ దేశాలన్నింటికీ ఇదో హెచ్చరిక
  • ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35 శాతం మందికే వ్యాక్సిన్
  • భార‌త్‌లో రోగుల‌కు ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు అంద‌ట్లేదు
  • చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు
భార‌త్‌లో ప్ర‌తిరోజు న‌మోద‌వుతోన్న క‌రోనా కేసులు, మృతుల సంఖ్య ప‌ట్ల  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని పేర్కొంటూ నివేదిక రూపొందించింది.

ఈ ఏడాది చివరి నాటికి భార‌త్‌లో 35 శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని అందులో పేర్కొంది. తొలి ద‌శ‌ కరోనా విజృంభ‌ణ‌ను బాగానే తట్టుకున్న భారత్ లో రెండో ద‌శ విజృంభ‌ణ‌లో మాత్రం అసాధార‌ణ ప‌రిస్థితులు తలెత్తుతున్నాయ‌ని వివ‌రించింది.

భార‌త్‌లో రోగుల‌కు ఆక్సిజన్, బెడ్లు, ఔష‌ధాలు, సౌకర్యాలు అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని చెప్పింది. ఆఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రమైన తొలి ద‌శ‌ ముప్పును తప్పించుకోగలిగిన అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు భారత్ లో నెల‌కొన్న  పరిస్థితులు ఓ హెచ్చరిక లాంటివ‌ని ఐఎంఎఫ్ తెలిపింది.

ఇదే స‌మ‌యంలో ధ‌నిక‌ దేశాల్లో ఇప్ప‌టికే 50 శాతం నుంచి 70 శాతం మ‌ధ్య వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని పేర్కొంది. ఆఫ్రికా జ‌నాభాలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు శాతం లోపు జ‌నాభాకే వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని తెలిపింది. అమెరికాలో 40 శాతం పైగా జ‌నాభాకు వ్యాక్సిన్ వేశార‌ని తెలియజేసింది.


More Telugu News