ఆ టీఎంసీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచండి: కలకత్తా హైకోర్టు ఆదేశాలు

  • నారద కుంభకోణం కేసులో టీఎంసీ నేతల అరెస్ట్
  • ప్రత్యేక కోర్టు బెయిలు ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన సీబీఐ
  • నేతల వయసు, ఆరోగ్యం దృష్ట్యా గృహ నిర్బంధం ఆదేశాలు ఇచ్చామన్న ధర్మాసనం
  • న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు
నారద కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను గృహ నిర్బంధంలో ఉంచాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. సీబీఐ వీరిని అరెస్ట్ చేయగా, ప్రత్యేక న్యాయస్థానం బెయిలు ఇచ్చింది. దీంతో బెయిలును సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.

విచారించిన న్యాయస్థానం నిందితులను ప్రస్తుతానికి గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అంతకుముందు ఈ విషయంలో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గృహ నిర్బంధం ఆదేశాలపైనా మళ్లీ వాదోపవాదాలు జరిగాయి. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని సీబీఐ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.

అరెస్ట్ అయిన వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే వారికి గృహనిర్బంధం విధించినట్టు వివరించింది. అధికారులు ఎవరూ వారిని నేరుగా కలవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరోవైపు, న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేసును మరో ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది.


More Telugu News