లాక్‌డౌన్‌లో రోడ్లపైకి.. 15 వేల వాహనాలను జప్తు చేసిన తెలంగాణ పోలీసులు

  • కారణం లేకున్నా రోడ్లపైకి
  • జరిమానా చెల్లించినా లాక్‌డౌన్ ముగిసిన తర్వాతే వాహనం అప్పగింత
  • మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్ల వసూలు
తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్న వారి నుంచి పోలీసులు 15 వేల వాహనాలను జప్తు చేశారు. సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.

పది గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామన్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి నిన్నటి వరకు ఏకంగా 15 వేల వాహనాలను పోలీసులు జప్తు చేశారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాన్ని తాత్కాలికంగా జప్తు చేసి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించినా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే వాహనాన్ని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు, లాక్‌డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వారిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.

కాగా, మే నెల తొలి రెండు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 4.31 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాగా వసూలు చేశారు.


More Telugu News