ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 23న బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు: విష్ణువర్ధన్ రెడ్డి

  • విష్ణువర్థన్ రెడ్డి ప్రెస్ మీట్
  • కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని వెల్లడి
  • మాటలు కోటలు దాటుతున్నాయని వ్యాఖ్యలు
  • చేతలు శూన్యమని వివరణ
ఏపీలో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయని, చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపడుతుందని వెల్లడించారు. కరోనా కారణంగా అమాయక ప్రజలు, వాస్తవాల్ని చూపించే పాత్రికేయులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో 514 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా కోసం బెడ్లు కేటాయించినట్టు చెబుతున్నారని, వాస్తవానికి 10 శాతం బెడ్లు కూడా కేటాయించలేదని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని అన్నారు. కరోనాతో పేద రోగులు అల్లాడుతుంటే సీఎం గానీ, ఒక్క మంత్రి గానీ పరామర్శించారా? అని ప్రశ్నించారు.

బడ్జెట్ పై స్పందిస్తూ... రూ.2.30 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, అందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది ఎంత? అని నిలదీశారు. వైద్య కళాశాలలకు ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని ప్రశ్నించారు. ఏపీ బడ్జెట్ అంతా బోగస్ అని, సంక్షేమానికి వేల కోట్లు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.   ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్టు వెల్లడించారు.


More Telugu News