రఘురామ సికింద్రాబాదుకు సొంతకారులో వెళ్లారు... ఆ సమయంలో ఏదైనా జరిగుండొచ్చు: సజ్జల

  • రఘురామకు సుప్రీంలో ఊరట
  • బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం
  • ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలుసన్న సజ్జల
  • కారులో కాళ్లు చూపిస్తూ విన్యాసాలు చేశాడని వెల్లడి
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసని అన్నారు. సీఐడీ కేసులో అభ్యంతరాలు ఏవీ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని భావిస్తున్నామని తెలిపారు. అయితే, రఘురామకృష్ణరాజును రమేశ్ ఆసుపత్రికి పంపలేదని ఎలా అడుగుతారు? హేతుబద్ధత లేకుండా వ్యవహరించి కంటెంప్ట్ (ధిక్కరణ) అని ఎలా అంటారని ప్రశ్నించారు.

"రమేశ్ ఆసుపత్రిలోనే పరీక్షలు ఎందుకు చేయాలి? గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆయన సొంతకారులోనే ప్రయాణించారు. ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం. సొంతకారులో వెళుతూ కాళ్లు, చేతులు చూపిస్తూ విన్యాసాలు చేశారు. ఒకవేళ అంతకుముందే ఫ్రాక్చర్ అయ్యుంటే కారులో కాళ్లు పైకెత్తి చూపించగలరా? బెయిల్ తిరస్కరణకు గురై రాజద్రోహం కేసు నిలబడుతుందనే చంద్రబాబు డైరెక్షన్ లో డ్రామాకు తెరలేపారు. వాస్తవాలు బయటికి రాకుండా నానా ప్రయత్నాలు చేశారు" అని ఆరోపించారు.

పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పు దురదృష్టకరం: సజ్జల

అటు, ఏపీ హైకోర్టు రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించడంపైనా సజ్జల స్పందించారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరుపుకోవచ్చని గతంలో డివిజన్ బెంచే చెప్పిందని, డివిజన్ బెంచ్ తీర్పుతోనే ఎస్ఈసీ ఎన్నికలకు వెళ్లారని వివరించారు. టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తోందని, ప్రజాక్షేత్రంలో గెలవలేమనే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని, ప్రతిసారీ ఏదో ఒక సాకుతో అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశామని సజ్జల పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ సంబర పడుతున్నారని, కానీ, ఎప్పుడు ఎన్నికలు జరిపినా ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఉద్ఘాటించారు.


More Telugu News