తుపానుకు కూలిన చెట్టు వద్ద నటి ఆనంద తాండవం... తిట్టిపోసిన నెటిజన్లు!

  • తౌతే తుపానుతో ముంబయిలో విధ్వంసం
  • నటి దీపికా సింగ్ కారుపై కూలిన చెట్టు
  • అది తాము నాటిన చెట్టేనన్న నటి
  • పాజిటివిటీ నింపేందుకే నర్తించానని వెల్లడి
ఇటీవల సంభవించిన తౌతే తుపాను ముంబయిని కూడా అతలాకుతలం చేసింది. తౌతే సృష్టించిన విధ్వంసంతో అనేక చెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలో, బుల్లితెర అందాల భామ దీపిక సింగ్ తన ఇంటి ముందు ఓ చెట్టు కూలిపోగా, విచారించడానికి బదులు ఎంతో తన్మయత్వంతో ఆనంద నృత్యాలు చేసింది. దీనిపై నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఎంతో అభద్రతాభావంతో కూడిన పరిస్థితుల్లో అలాంటి డ్యాన్సులు అవసరమా? అంటూ మండిపడ్డారు. నీ ఇల్లు కూలిపోకుండా ఉన్నందుకు సంతోషిస్తూ డ్యాన్సులు చేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నటి దీపిక సింగ్ బదులిచ్చింది.

ఆ చెట్టును ఐదేళ్ల కిందట తామే నాటామని వెల్లడించింది. తౌతే తుపాను సందర్భంగా ఆ చెట్టు తన కారుపై పడిపోయిందని తెలిపింది. ఆనందంతో నర్తించడం పట్ల తాను చింతించడంలేదని, విచారకర పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథాన్ని నింపాలన్న ఉద్దేశంతోనే తాను డ్యాన్స్ చేశానని దీపిక స్పష్టం చేసింది. పైగా తన డ్యాన్సును 99 శాతం మంది మెచ్చుకున్నారని, తిట్టినవాళ్లు ఒక్కశాతం మాత్రమేనని పేర్కొంది. అయితే, ఇలాంటి సమయాల్లో ఎవరూ బయటికి రాకూడదని తన అభిమానులకు సూచిస్తానని సామాజిక బాధ్యతను ప్రకటించింది. తమ ఇంటి ముందే కూలిపోయింది కాబట్టే తాను బయటికి వచ్చానని తెలిపింది.

దీపిక గతంలో వచ్చిన 'దియా ఔర్ బాతి హమ్' అనే సీరియల్ తో ఎంతో పాప్యులర్ అయింది. ఈ సీరియల్ తెలుగులోనూ 'ఈతరం ఇల్లాలు' పేరిట అనేక ఏళ్లపాటు ప్రసారమైంది. ఇందులో దీపిక 'పోలీసాఫీసర్ సంధ్య' పాత్ర పోషించింది.


More Telugu News